హైదరాబాద్ వ్యాపారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

  • అర్ధరాత్రి 1 వరకు దుకాణాలు తెరుచుకోవచ్చునని సీఎం ప్రకటన
  • మద్యం దుకాణాలు మినహా మిగతా దుకాణాలు తెరుచుకోవచ్చునని వెల్లడి
  • హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అర్ధరాత్రి వరకు హోటల్స్, రెస్టారెంట్లు
హైదరాబాద్ నగర వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో దుకాణాలు తెరిచి ఉండొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పోలీసులు కొన్ని నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేయిస్తున్నారు. అయితే దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నగరంలో అర్ధరాత్రి 1 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లను నడుపుకోవచ్చని సీఎం ప్రకటించారు.

రాత్రి 11 దాటిన తర్వాత ఫుడ్ కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మద్యం దుకాణాలు మినహా ఇతర ఏ వ్యాపారమైనా రాత్రి ఒకటి వరకు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్లు రాత్రి ఒకటి వరకు తెరుచుకోనున్నాయి.

మద్యం దుకాణాల విషయంలో మినహాయింపులు ఉండబోవని సభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మద్యం దుకాణాలు ఎక్కువ సేపు తెరిచి ఉంటే జనం అంతే ఎక్కువగా మద్యం సేవిస్తారని పేర్కొన్నారు. మద్యం వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారాలు రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకునే విధంగా పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.


More Telugu News