అదే విషయం అక్బరుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారు: వేముల ప్రశాంత్ రెడ్డి

  • రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు... నియంతృత్వ పాలన అని ఆగ్రహం
  • జీరో అవర్ మొత్తం ఎత్తేశారని... ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని ఆగ్రహం
  • కేసీఆర్ ను, బీఆర్ఎస్‌ను తిట్టేందుకే అసెంబ్లీని ఉపయోగించుకుంటున్నారని విమర్శ
రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని, నియంతృత్వ పాలన అని... ఇంత అధ్వానంగా సభ ఎప్పుడూ జరగలేదని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం నాడు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... శాసనసభలో తమ పార్టీ గొంతు నొక్కారన్నారు. జీరో అవర్ మొత్తం ఎత్తేశారని... ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని విమర్శించారు.

సభలో చర్చలకు అవకాశం ఇవ్వడం లేదని, ప్రజాసమస్యలపై మాట్లాడుదామంటే మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రశ్నిస్తే మార్షల్స్‌తో బయటకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను, బీఆర్ఎస్‌ను తిట్టేందుకే అసెంబ్లీని వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి వికృతరూపం బయటపడిందన్నారు. కాంగ్రెస్‌ మిత్రపక్షమని చెబుతున్న మజ్లిస్ పార్టీ కూడా అధికార పార్టీ తీరును తప్పుబట్టిందన్నారు. 

రేవంత్ రెడ్డి సభానాయకుడిగా కాకుండా అటవిక రాజులా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇష్టారాజ్యంగా సభను తప్పుదోవ పట్టించారన్నారు. కేసీఆర్‌ను తిట్టడం... గత ప్రభుత్వంపై ఆరోపణలతోనే సభ నడించిందన్నారు. అసెంబ్లీని కౌరవ సభలా నడిపించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కళ్లున్న కబోధి అన్నారు. హామీలను అమలు చేయడమే లక్ష్యంగా తాము మాట్లాడామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలు, 420 హామీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదన్నారు.

అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించడం దారుణమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం అబద్దాలు చెప్పారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చెప్పారని... కానీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారు? అని ప్రశ్నించారు. అబద్దాల్లో రేవంత్ రెడ్డిని గిన్నిస్ రికార్డ్‌లోకి ఎక్కించాలని ఎద్దేవా చేశారు.


More Telugu News