ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు.. జేపీ వెంచర్స్‌కు సుప్రీంలో షాక్

  • ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంలో విచారణ
  • జెపీ సంస్థపై జరిమానా తొలగింపుకు నో చెప్పిన సుప్రీం కోర్టు
  • శాస్త్రీయ ఆధారాలతో నివేదిక అందజేయడానికి మూడు నెలల గడువు కోరిన ఏపీ సర్కార్
  • ఆగస్టు 31కి విచారణ వాయిదా
ఏపీలో ఇసుకను అక్రమంగా తవ్వేసిన కేసులో జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టులో బిగ్‌షాక్ తగిలింది. ఈ కేసులో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రూ. 18 కోట్లు విధించడంపై జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రూ. 18 కోట్ల జరిమానా నుంచి విముక్తి కల్పించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపింది. ఈ అంశంపై తాజా నివేదికలతో ఏపీ ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో తనిఖీలు జరిపామని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. తనిఖీల్లో తేలిన విషయాలన్నీ కోర్టు ముందు ఉంచామని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు.
 
వరదల కారణంగా అక్రమ ఇసుక తవ్వకాల అనవాళ్లు కొట్టుకుపోయాయనీ, వాటిని తేల్చడానికి శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ చేపట్టాలని భావిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. శాస్త్రీయ అధ్యయనానికి కొన్ని సంస్థలను సంప్రదించామని, అన్నీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది. 

ఇసుక తవ్వకాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన జేపీ వెంచర్స్‌ను వదిలిపెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అక్రమ తవ్వకాలకు బాధ్యులైన ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఏమి చేయాలన్నది ఆదేశిస్తామని తెలిపింది.


More Telugu News