రేవంత్! నీ పౌరుషం చచ్చిపోయిందా?: బీజేపీ ఎంపీ అర్వింద్

  • ఢిల్లీలో మీడియాతో అర్వింద్ చిట్‌చాట్
  • బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా సాగాయని విమర్శ
  • ప్రస్తుతం ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయని సంతోషం వ్యక్తం చేసిన ఎంపీ
  • కేటీఆర్‌ను మార్షల్స్ 150 కిలోమీటర్ల వేగంతో అసెంబ్లీ నుంచి విసిరేశారన్న అర్వింద్
  • రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే నేతకే అధ్యక్ష పదవి దక్కుతుందని స్పష్టీకరణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని వెలికితీస్తామన్న రేవంత్‌రెడ్డి 9 నెలలు అయినా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.  ‘రేవంత్ .. ఏమైంది నీ పౌరుషం.. చచ్చిపోయిందా?’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో నిన్న మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయనంతకాలం ఆమెను అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని, అరెస్ట్ చేశాక మాట మార్చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు అసెంబ్లీ సమావేశాలను ఏదో మొక్కుబడిగా నిర్వహించారని విమర్శించారు. ఇప్పుడు సజావుగా జరగడం సంతోషమని వ్యాఖ్యానించారు. సభలో ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు.

అసెంబ్లీ నుంచి కేటీఆర్‌ను మార్షల్స్ ఎత్తుకుపోవడంపైనా అర్వింద్ స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి (బీఆర్ఎస్) ప్రజలు కనబడలేదని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని పేర్కొన్నారు. తాను ఒక క్రికెటర్‌ని అని, ఒక బౌలర్ 150 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరితే ఎలా ఉంటుందో, అదే స్పీడ్‌తో కేటీఆర్‌ను మార్షల్స్ బయటకు విసిరేశారని పేర్కొన్నారు. ఇక, తమ పార్టీ విషయానికి వస్తే.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే నేతకే అధ్యక్ష పదవి దక్కుతుందని అర్వింద్ తేల్చి చెప్పారు.


More Telugu News