తెలంగాణలో సర్పంచ్‌లు ఏం తప్పు చేశారు... సేవ చేయడమే వారి తప్పా?: హరీశ్ రావు

  • పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సచివాలయ ముట్టడికి జేఏసీ పిలుపు
  • ఎక్కడికి అక్కడ సర్పంచ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు
  • రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని హరీశ్ రావు ఆగ్రహం
తెలంగాణలో సర్పంచ్‌లు ఏం తప్పు చేశారు? ప్రజలకు సేవ చేయడమే తప్పా? వడ్డీలకు డబ్బు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు... అలాంటి వారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం దారుణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం జేఏసీ సెక్రటరియేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో అరెస్టైన సర్పంచ్‌లను పరామర్శించిన హరీశ్ రావు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఎనిమిది పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించిందని ధ్వజమెత్తారు.

జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి నెలా రూ.275 కోట్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు పల్లె ప్రగతి డబ్బులు ఇవ్వటం లేదన్నారు. పెండింగ్ నిధుల కోసం సర్పంచ్‌లు ప్రశ్నిస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు.


More Telugu News