పారిస్ ఒలింపిక్స్ విజేత‌ల‌కు జేఎస్‌డ‌బ్ల్యూ ఎంజీ బంప‌ర్ ఆఫ‌ర్‌

  • ప‌త‌కాలు సాధించిన భారత క్రీడాకారుల‌కు ఎంజీ విండ్సర్ కారు బ‌హుమ‌తి
  • 'ఎక్స్' ద్వారా ప్ర‌క‌టించిన జేఎస్‌డ‌బ్ల్యూ గ్రూప్ ఎండీ స‌జ్జ‌ల్ జిందాల్‌ 
  • సోష‌ల్ మీడియాలో పోస్ట్ వైర‌ల్‌
  • త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్న నెటిజన్లు
పారిస్ ఒలింపిక్స్ ప‌త‌కాల‌ విజేత‌ల‌కు జేఎస్‌డ‌బ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స‌జ్జ‌ల్ జిందాల్‌ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ప‌త‌కాలు సాధించిన భారత క్రీడాకారుల‌కు 'ఎంజీ విండ్సర్' కారు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

ఈ విష‌యాన్ని ఆయ‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ద్వారా వెల్ల‌డించారు. "టీమ్ ఇండియా నుండి ప్రతి ఒలింపిక్ పతక విజేతకు జేఎస్‌డ‌బ్ల్యూ ఎంజీ ఇండియా నుండి ఒక అద్భుతమైన కారు ఎంజీ విండ్సర్ బహుమతిగా ఇవ్వబడుతుందని ప్రకటించడం ఆనందంగా ఉంది! ఎందుకంటే మా ఉత్తమమైనది వారి అంకితభావం, విజయానికి ఉత్తమమైనది!" అని ఆయ‌న ట్వీట్ చేశారు. దాంతో ఈ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జిందాల్ పోస్ట్‌కి కొన్ని గంటల్లోనే 76 వేల వ్యూస్, దాదాపు 500 లైక్‌లు వచ్చిప‌డ్డాయి.

దీనిపై నెటిజన్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 'గొప్ప చొరవ' అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా, మ‌రొకరు 'మా ఒలింపియన్‌లకు ఇంత అద్భుతమైన బహుమతిని అందిస్తున్న సజ్జన్ జిందాల్, జేఎస్‌డ‌బ్ల్యూ, మీరు భారతీయ స్ఫూర్తికి విజేతలు' అని అన్నారు. అలాగే మ‌రో యూజ‌ర్ 'వావ్.. క్రీడాకారులను ప్రోత్సహించడానికి గొప్ప చొరవ' అని వ్యాఖ్యానించారు.

కాగా, ఈ కారు డిజైన్ విండ్సర్ కాజిల్ ఆర్కిటెక్చర్ నుండి ప్రేరణ పొందిందని ఎంజీ సంస్థ పేర్కొంది. ఎంజీ విండ్సర్ సున్నితమైన హస్తకళ, శ్రేష్ఠత, రాజ‌సాన్ని కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. ఇక ఎంజీ విండ్సర్ కారు ధ‌ర రూ. 25 ల‌క్ష‌ల నుంచి రూ. 30 ల‌క్షల వ‌ర‌కు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ కారును వ‌చ్చే నెల 13వ తేదీన కంపెనీ ఆవిష్క‌రించనుంది. ఇది విద్యుత్ ఆధారిత కారు.


More Telugu News