నీట్ యూజీ పరీక్ష లీకేజీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

  • నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ లోపాల వల్లనే లీకేజీ
  • పరీక్ష రద్దు అవసరం లేదని గతంలోనే తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు
  • తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలన్న ధర్మాసనం
నీట్ యూజీ పరీక్షల లీకేజీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు (శుక్రవారం) కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని గత నెలలోనే తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ..వాటి కారణాలు వెల్లడిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ లోపాల వల్లనే లీకేజీ జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. పేపర్ లీకేజీలో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని, పరీక్ష పవిత్రతను దెబ్బతీసే స్థాయిలో జరగలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
ఝార్ఖండ్ లోని హజారీబాగ్, బీహార్ పాట్నా కేంద్రాల్లో మాత్రమే పేపర్ లీకేజీ జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తు కూడా జరుగుతున్నందున పరీక్ష రద్దు చేయాలని అనుకోవడం లేదని తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీలో కొన్ని లోపాలు ఉన్నాయనీ, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో పరీక్షల సంస్కరణల కోసం ఇస్రో మాజీ చీఫ్ కే రాధా కృష్ణన్ నేతృత్వంలో నియమించిన కమిటీకి ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్యానెల్ ను మరింత విస్తరించాలని సూచిస్తూ .. పరీక్ష విధానంలో లోపాలను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలపై సెప్టెంబర్ 30వ తేదీ లోగా నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది.  నివేదికను కమిటీ అందజేసిన అనంతరం వాటిలో అమలు చేసే అంశాలపై కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
 
వైద్య విద్యలో ప్రవేశం కొరకు నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలోని 571 నగరాల్లో 4750 సెంటర్లలో పరీక్షలు జరగ్గా, 23 లక్షలకుపైగా విద్యార్ధులు హాజరయ్యారు. పేపర్ లీక్ ఘటనతో పరీక్ష రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై  విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈరోజు తుది తీర్పు వెల్లడించింది.


More Telugu News