కర్ణాటక సీఎంకు గవర్నర్ నోటీసులు .. కీలక నిర్ణయాన్ని తీసుకున్న క్యాబినెట్

  • కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
  • సీఎం సిద్దరామయ్యకు గవర్నర్ నోటీసులపై క్యాబినెట్ అభ్యంతరం
  • నోటీసులు వెనక్కు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం 
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడాన్ని కర్ణాటక క్యాబినెట్ తప్పుబట్టింది. మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) సంస్థ ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు గవర్నర్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడం కర్ణాటక రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయింది. 

ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య లేకుండానే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన నిన్న విధాన సౌధలో క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ జారీ చేసిన నోటీసులపై క్యాబినెట్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ముడా అవినీతికి సంబంధించి జారీ చేసిన నోటీసులను గవర్నర్ వెనక్కు తీసుకోవాలని క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

క్యాబినెట్ భేటీ అనంతరం సహకార శాఖ మంత్రి రాజణ్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ భవన్ నుండి సీఎం సిద్దరామయ్యకు వచ్చిన నోటీసులపై చర్చించామని, దీనిపై న్యాయపోరాటం చేయాలని తీర్మానించడం జరిగిందని చెప్పారు. సీఎంకి నోటీసులు జారీ చేయడం రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. నోటీసులు తిరస్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ అంశం ఇప్పుడు కన్నడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


More Telugu News