విదేశాల్లో 13 లక్ష‌ల మందికి పైగా భార‌తీయ విద్యార్థులు

  • విదేశాల్లోని భార‌త‌ విద్యార్థుల డేటాను విడుద‌ల చేసిన కేంద్ర మంత్రి కీర్తివ‌ర్ధ‌న్ సింగ్
  • అమెరికా, కెన‌డా, ఆస్ట్రేలియా, యూకే స‌హా 108 దేశాల్లో భార‌తీయ విద్యార్థులు
  • అత్య‌ధికంగా కెన‌డాలో 4.27 ల‌క్ష‌ల మంది ఇండియ‌న్ స్టూడెంట్స్
2024లో ఇప్ప‌టి వ‌ర‌కు 108 దేశాల్లో 13 ల‌క్ష‌ల‌కుపైగా భార‌తీయ విద్యార్థులు ఉన్న‌త విద్య అభ్య‌సిస్తున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం గురువారం పార్ల‌మెంట్‌లో వెల్ల‌డించింది. ఈ మేర‌కు రాజ్య‌స‌భ‌లో కేంద్ర మంత్రి కీర్తివ‌ర్ధ‌న్ సింగ్ విద్యార్థుల తాలూకు ఓ ప్ర‌త్యేక‌ డేటాను విడుద‌ల చేశారు. ఈ డేటా ప్ర‌కారం 13,35,878 మంది భార‌తీయ విద్యార్థులు అమెరికా, కెన‌డా, ఆస్ట్రేలియా, యూకే, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, సింగ‌పూర్, ర‌ష్యా, ఇజ్రాయిల్‌, ఉక్రెయిన్ స‌హా 108 దేశాల్లో ఉన్న‌త విద్య అభ్య‌సిస్తున్నారు. అదే గ‌తేడాది ఈ సంఖ్య 13,18,955గా ఉంది. 2022లో 9,07,404 మంది విద్యార్థులు ఉన్న‌ట్లు తెలిసింది. 
 
ఇక అత్య‌ధికంగా కెన‌డాలో 4.27 ల‌క్ష‌ల మంది ఇండియ‌న్ స్టూడెంట్స్ చ‌దువుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో వ‌రుస‌గా యూఎస్ లో 3,37,630, చైనాలో 8,580, ఉక్రెయిన్‌లో 2510, ఇజ్రాయిల్‌లో 900, పాకిస్థాన్‌లో 14 మంది చ‌దువుతున్నార‌ని తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మ‌న‌ విద్యార్థులు ఉన్న ఆయా దేశాల్లో అక్క‌డి భార‌త ఎంబ‌సీ, మిష‌న్ అధికారులు క్ర‌మం త‌ప్ప‌కుండా వారితో సంప్ర‌దింపులు జ‌రుపుతూ రాయ‌బార కార్యాల‌యాల్లో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని సూచించ‌డం జరుగుతుందన్నారు. ఒకవేళ విద్యార్థుల‌కు వ్య‌క్తిగ‌తంగా ఎంబ‌సీలకు వెళ్లి పేర్లు న‌మోదు చేసుకోవ‌డం కుద‌ర‌ని ప‌క్షంలో గ్లోబల్ రిస్తా పోర్ట‌ల్ ద్వారా న‌మోదు చేసుకునే వెసులుబాటు క‌ల్పించిన‌ట్లు వెల్ల‌డించారు. 

అలాగే విదేశాల‌కు మొద‌టిసారి వ‌చ్చే విద్యార్థుల‌కు వెల్‌కం సెర్మ‌నీల‌ను నిర్వ‌హించి, ఆయా దేశాల్లో ఉన్న భ‌ద్ర‌తా నియ‌మాల‌ను తెలియ‌జేస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే సౌలభ్యం కోసం భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ట్రావెల్, వీసా ఆన్ అరైవల్ సౌకర్యాలను అందించే దేశాల సంఖ్యను పెంచడానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు.


More Telugu News