ఐపీఎల్ మెగా వేలంపై షారుఖ్‌తో వాగ్వాదం.. స్పందించిన పీబీకేఎస్ కో-ఓనర్!

  • కేకేఆర్ ఓనర్‌ షారుఖ్‌తో తనకు వ్యక్తిగత శత్రుత్వం ఏదీ లేదన్న నెస్ వాడియా
  • జైషాతో సమావేశంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పారని వ్యాఖ్య
  • అంతిమంగా వాటాదారులకు మేలు చేయాలన్నదే లక్ష్యమని స్పష్టీకరణ
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై ఫ్రాంచైజీల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ విషయమై బీసీసీఐ సెక్రటరీ జైషాతో ఫ్రాంచైజీ అధినేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెగా వేలం, ప్లేయర్ల రిటెన్షన్‌పై కొందరు అనుకూల అభిప్రాయాలు వ్యక్తం చేయగా, మరికొందరు వ్యతిరేకించారు. ముఖ్యంగా కేకేఆర్, సన్‌రైజర్స్ టీమ్స్ విముఖత ప్రదర్శించాయి. ఈ క్రమంలో కేకేఆర్ ఓనర్ షారుఖ్‌ ఖాన్‌తో తనకు జరిగిన వాగ్వాదంపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా స్పందించారు. తమ మధ్య వ్యక్తిగత వైరం ఏదీ లేదని స్పష్టం చేశారు. 

‘‘నాకు షారుఖ్ ఖాన్ 25 ఏళ్లుగా తెలుసు. మా మధ్య ఎటువంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. ఆ సమావేశంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వాళ్ల అభిప్రాయాలు వాళ్లవి. అంతిమంగా వాటాదార్లకు మేలు చేకూర్చే నిర్ణయం తీసుకోవాలి’’ అని అన్నాడు. 

కాగా, ఇంపాక్ట్ రూల్‌పై కూడా ఫ్రాంచైజీలు రెండు వర్గాలుగా విడిపోయాయి. దీనిపై ఢిల్లీ ఫ్రాంచైజీ కో-ఓనర్ పార్థ్ జిందాల్ మాట్లాడుతూ.. ‘‘కొందరు ఇంపాక్ట్ రూల్ కావాలంటున్నారు. దీంతో, యువ ప్లేయర్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభిస్తుందనేది వారి వాదన. ఆల్‌రౌండర్ల అభివృద్ధికి ఈ రూల్ చేటు చేస్తుందని కొందరు నమ్ముతున్నారు. కాబట్టి.. ఈ విషయంలో అనుకూల ప్రతికూల అంశాలు రెండూ ఉన్నాయి. నేను మాత్రం ఇంపాక్ట్ రూల్‌ను వ్యతిరేకిస్తున్నాను. 11 ఆటగాళ్ల జట్ల మధ్యే ఆట జరగాలన్నది నా అభిప్రాయం. ఆల్‌రౌండర్లు జట్టుకు ఎంతో ముఖ్యం. ఈ రూల్ కారణంగా కొందరు బ్యాటింగ్ చేయకుండా.. మరికొందరు బౌలింగ్ చేయకుండా అయిపోతారు’’ అని చెప్పారు.


More Telugu News