ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు... స్పందించిన పవన్ కల్యాణ్

  • మంద కృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం చేశారని కితాబు
  • నరేంద్రమోదీ, చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకున్నారని వెల్లడి
  • ఎస్సీలలో ఐక్యత చెక్కుచెదరకుండా చూడాలన్న జనసేనాని
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక వర్గం నిరంతర పోరాటానికి దక్కిన ఫలితమిదన్నారు. ఎస్సీలలో ఐక్యత చెక్కుచెదరకుండా చూడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మంద కృష్ణ మాదిగ పోరాటం చేశారని కితాబునిచ్చారు. ఈ పోరాటాలకు ఫలితం దక్కిందని పేర్కొంటూ, మంద కృష్ణకు అభినందనలు తెలిపారు.

మాదిగలకు రిజర్వేషన్ కల్పనకు ప్రధాని మోదీ రెండో టర్మ్‌లో సానుకూలంగా స్పందించిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. మోదీ ప్రభుత్వం గతంలో వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడటం హర్షణీయమన్నారు. వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు తర్వాత ఎస్సీలలో ఐక్యత చెక్కుచెదరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ వర్గం మేధావులు, విద్యావంతులపై ఉందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాడుతున్నారంటే అందుకు వారి ఆందోళనను అర్థం చేసుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగ సామాజికవర్గం కూడా ముందుకు రావాలని కోరుకునే మాల సామాజిక వర్గం విద్యావేత్తలు ఉన్నారని పేర్కొన్నారు.


More Telugu News