వాయనాడ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

  • నా తండ్రి చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడూ అలాగే ఉందని వ్యాఖ్య
  • ఈ విషాదాన్ని చూసి ప్రతిఒక్కరూ బాధపడుతున్నారని వ్యాఖ్య
  • ఇక్కడి పరిస్థితులను పరిశీలించేందుకే వచ్చానన్న రాహుల్ గాంధీ
వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన తండ్రి చనిపోయినప్పుడు ఎంతగా బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నానన్నారు. బాధితులకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చామన్నారు. తానొక్కడినే కాదని... ఈ విషాదాన్ని చూసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు. ఇది హృదయాన్ని కదిలిస్తోందన్నారు.

ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకే తాను వచ్చానన్నారు. చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోయారు... ఇళ్లనూ పొగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. తమవంతు సాయం కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు సాయం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇక్కడి పరిస్థితి చూస్తుంటే తనకు నోట మాట రావడం లేదని ప్రియాంకగాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు.


More Telugu News