నేను కనిపిస్తేనే రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారింది: సబితా ఇంద్రారెడ్డి

  • ఎంతోమంది సీఎంలను చూశాం... వారంతా మహిళలను గౌరవించేవారన్న సబిత
  • రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన
  • కేసీఆర్‌ను తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శ
తాను అసెంబ్లీలో కనిపిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె బీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులను ఆ సీటుపై చూశామని... వారంతా మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పేవారని పేర్కొన్నారు.

వైఎస్సార్, రోశయ్య, చంద్రబాబు, కేసీఆర్ మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేవారన్నారు. తమను మాట్లాడనీయాలని సభలో నాలుగున్నర గంటలు నిలబడినా అవకాశమివ్వలేదని విమర్శించారు. తాము అంతసేపు నిలబడినా కాంగ్రెస్ సభ్యుల్లో కొంచెం కూడా విచారం లేదని... పైగా రాక్షసానందం పొందారన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో శాంతిభద్రతలు కరవయ్యాయన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు. 

ఎస్సీ వర్గీకరణపై మాట్లాడేందుకు ఆదివాసీ ఆడబిడ్డ కోవా లక్ష్మికి కూడా అవకాశమివ్వలేదన్నారు. ప్రజలకు భద్రత ఎలా కల్పించాలనే ఆలోచన లేకుండా కాంగ్రెస్ నేతలు శాడిస్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వరుస అత్యాచారాలతో హైదరాబాద్‌కు ఉన్న విలువ తగ్గిపోవడం లేదా? అన్నారు. కేసీఆర్‌ను తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.


More Telugu News