ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందన్న సుప్రీంకోర్టు
  • విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమంజసమేనని వెల్లడి
  • 6:1 మెజారిటీతో ఉపవర్గీకరణకు మద్దతు పలికిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం
  • వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది
ఎస్సీ, ఎస్టీ కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తన తీర్పులో స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమంజసమేనని ఉద్ఘాటించింది. 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2004లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం నేడు పక్కనబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయకూడదంటూ ఇచ్చిన నాటి తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. 

ఈ బెంచ్ లో, ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రమే అభ్యంతరం తెలిపారు. ఉపవర్గీకరణకు సీజేఐ చంద్రచూడ్ తో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీశ్ చంద్ర, జస్టిస్ మనోజ్ మిశ్రా అనుకూలంగా తీర్పు ఇచ్చారు. 

సుప్రీం తీర్పును అనుసరించి రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ఆ మార్గదర్శకాలు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని నిర్దేశించింది.


More Telugu News