కూటమి ప్రభుత్వంపై విమర్శలు సరికాదు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

  • రెండు నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయని భావించొద్దన్న కేతిరెడ్డి
  • ఇసుక, మద్యం వ్యాపారాలే వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే
  • నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని జగన్ పదేపదే చెప్పడంతో మిగతా వర్గాలు దూరమయ్యాయని ఆవేదన
వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలల కూడా కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటూ విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. ఈ స్వల్ప వ్యవధిలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం సరికాదన్నారు. సంపద సృష్టించిన తర్వాతే అమ్మ ఒడి వంటి పథకాలను ఇస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదని సొంత పార్టీ నేతలకు హితవు పలికారు. అందుకోసం ఈ ఏడాది చివరి వరకైనా అవకాశం ఇవ్వాలని సూచించారు.

అప్పటికీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే అప్పుడు ప్రభుత్వంపై ఎలా పోరాడాలనేదానిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో వీడియో పోస్టు చేశారు. 

ఇసుక, మద్యం విషయంలో తమ ప్రభుత్వ విధానాలను కేతిరెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వం పాలన చేయాలి తప్పితే వ్యాపారాలు చేయకూడదని అన్నారు. దీనికి తాను తొలి నుంచీ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. దీనివల్లే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పుడదే చేస్తోందని విమర్శించారు. అలాగే, తమ ప్రభుత్వం వసూలు చేసిన చెత్తపన్నును సమర్థించారు. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని జగన్ పదేపదే చెప్పడంతో మిగతా వర్గాలు ఆయనకు దూరమయ్యారని అన్నారు. తాము అన్ని పథకాలు అమలు చేసినప్పటికీ 11 సీట్లకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏది ఏమైనా ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని, కాబట్టి అప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అల్లర్లపైనా కేతిరెడ్డి స్పందించారు. మనం వేసిన బంతి తిరిగి మనకే వచ్చి తగులుతోందని అన్నారు. అప్పట్లో ఇలాంటి వాటిని ప్రోత్సహించిన వారు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


More Telugu News