జైలు భోజనం అరగడం లేదు.. ఇంటి భోజనం తెప్పించుకునే అవకాశం ఇవ్వండి: కోర్టును కోరిన సినీ నటుడు దర్శన్

  • అభిమాని హత్యకేసులో అరెస్ట్ అయిన దర్శన్, నటి పవిత్రాగౌడ్
  • పరప్పన అగ్రహార జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా దర్శన్
  • జైలు భోజనంతో 10 కిలోల బరువు తగ్గిపోయానన్న నటుడు
  • దర్శన్ ఇంటి భోజనం ఎందుకు తెప్పించుకోకూడదో చెప్పాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా
జైలు భోజనం తనకు అరగడం లేదని, బరువు కూడా బాగా తగ్గిపోయానని, కాబట్టి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే అవకాశం ఇవ్వాలన్న కన్నడ సినీ నటుడు దర్శన్ పెట్టుకున్న పిటిషన్ విచారణను కర్ణాటక హైకోర్టు వాయిదా వేసింది. 

చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన ఆరోపణలతో దర్శన్ తూగుదీప, నటి పవిత్రాగౌడ జూన్ 10న అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో దర్శన్ అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్నారు. ఇంటి భోజనం కోసం గతంలోనూ ఆయన దరఖాస్తు చేసుకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో దానిని ఉపసంహరించుకున్నారు. తాజాగా మరోమారు ఇంటి భోజనం కోసం హైకోర్టును ఆశ్రయించారు. జైలులోని ఆహారం తనకు జీర్ణం కావడం లేదని, బరువు కూడా పది కిలోల వరకు తగ్గిపోయానని అందులో పేర్కొన్నారు. కాబట్టి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎం.నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం జైలులోని ఖైదీలందరికీ పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనానికి అవకాశం ఉందని, అయితే దర్శన్‌కు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే అవకాశం ఎందుకివ్వాలో చెప్పాలని ఆదేశిస్తూ అందుకు పది రోజు సమయం ఇచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.


More Telugu News