ఏపీలో రూ.75,000 కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది: మంత్రి టీజీ భరత్

  • పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు
  • సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన పరిశ్రమల శాఖ మంత్రి భరత్
  • బీపీసీఎల్ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయిస్తారని వెల్లడి
  • సీబీఎన్ బ్రాండ్ తో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తామని స్పష్టీకరణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. సమీక్ష ముగిసిన అనంతరం టీజీ భరత్ మీడియాతో మాట్లాడారు. ఏపీకి రూ.75,000 కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ రాబోతోందని వెల్లడించారు. బీపీసీఎల్ పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయిస్తారని తెలిపారు. 

కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ ఫాస్ట్ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అమెరికా కాన్సులేట్  జనరల్ జెన్నిఫర్ కూడా ఆసక్తి కనబరిచారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. 

ఇక, దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావాలని నేటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ ఎంఎస్ఎంఈ, క్లస్టర్ విధానాలు అమలు చేస్తామని తెలిపారు. సీబీఎన్ బ్రాండ్ తో పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తామని వివరించారు. 

రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని టీజీ భరత్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, ఓర్వకల్లు, కొప్పర్తిలో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని వివరించారు. కొత్తగా కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేటలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

చిత్తూరు నోడ్ కింద రూ.1,350 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. రాజధాని అమరావతి సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి టీజీ భరత్ తెలిపారు. 

గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి కల్పించారని మంత్రి టీజీ భరత్ విమర్శించారు. గతంలో పారిశ్రామికవేత్తలను షేర్లు, పర్సంటేజీలు అడిగే పరిస్థితి ఉండేదని తెలిపారు.


More Telugu News