రేవంత్ రెడ్డి ప్రతిపాదన... స్పందించిన తెలుగు పరిశ్రమ

  • గద్దర్ అవార్డులపై ప్రతిపాదన చేసిన రేవంత్ రెడ్డి
  • FDCతో చర్చించామన్న తెలుగు ఫిలిమ్ ఛాంబర్, నిర్మాతల మండలి
  • కమిటీని ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీని కోరినట్లు వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన గద్దర్ అవార్డులపై తెలుగు ఫిలిమ్ ఛాంబర్ స్పందించింది. ఈ అవార్డులపై ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (FDC)తో చర్చించినట్లు తెలుగు ఫిలిమ్ ఛాంబర్, నిర్మాతల మండలి వెల్లడించాయి. గద్దర్ అవార్డుల కోసం కమిటీని ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీని కోరినట్లు చెప్పారు. కమిటీ ద్వారా విధి విధానాలను తయారు చేసి ఎఫ్‌డీసీ ద్వారా ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిస్తామని తెలిపారు.

టాలీవుడ్‌పై నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గద్దర్ అవార్డులపై తనంతట తానుగా ప్రతిపాదించానని... కానీ సినిమా పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఓ కార్యక్రమంలో అన్నారు. గద్దర్ అవార్డుల అంశంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉందన్నారు. ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనపై ఈ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఈరోజు స్పందించింది.


More Telugu News