ఎన్సీపీ ఎమ్మెల్యే కారు ధ్వంసం చేసిన ఎంఎన్ఎస్ కార్యకర్త.. కాసేపటికే గుండెపోటుతో మృతి.. మరో ఇద్దరికి అస్వస్థత

  • ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అమోల్ మిత్కారీపై ఆరోపణలు
  • ఆందోళనకు దిగి ఆయన కారును ధ్వంసం చేసిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు
  • ఆ తర్వాత కాసేపటికే గుండెపోటుతో ఒకరి మృతి
  • ఊపిరి ఆడడం లేదంటూ ఆసుపత్రిలో చేరిన మరో ఇద్దరు
  • ఎంఎన్ఎస్ వర్గాల్లో షాకింగ్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే, ఆ పార్టీ అధికార ప్రతినిధి అమోల్ మిత్కారీ కారును ధ్వంసం చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కార్యకర్త ఆ తర్వాత కాసేపటికే ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. మృతుడిని 24 ఏళ్ల జై మలోకర్‌గా గుర్తించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మిత్కారీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న అతను తనకు అసౌకర్యంగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. 

అదే సమయంలో మరో ఇద్దరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం ఎంఎన్ఎస్‌ వర్గాల్లో కలకలం రేపింది. వీరిలో ఒకరు అకోలా జిల్లా ఎంఎన్‌సీ అధ్యక్షుడు పంకజ్ సాబ్లే కాగా, మరొకరు సౌరభ్ భగత్. వీరు కూడా తమకు అసౌకర్యంగా ఉందని, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడం గమనార్హం. దీంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. 

తనపై జరిగిన దాడిపై ఎమ్మెల్యే మిత్కారీ మాట్లాడుతూ.. తనను చంపేందుకు రాజ్ థాకరే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఆందోళన సందర్భంగా వారి కార్యకర్తలే ఆ విషయం మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. ఎంఎన్‌ఎస్ ఆందోళనకు ప్రతిగా మిత్కారీ మద్దతుదారులు కూడా ఆందోళనకు దిగారు. ఇరువర్గాల ఆందోళనపై పోలీసులు కేసులు నమోదు చేశారు.


More Telugu News