హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హతం.. అధికారికంగా ధ్రువీకరణ

  • ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్య చేసి జియోనిస్ట్ గ్రూప్
  • పాలస్తీనాలో యూదుల హక్కుల కోసం పోరాడుతున్న జియోనిస్టులు
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. ఇస్మాయిల్‌తో పాటు అతడి బాడీగార్డు ఒకరు చనిపోయారని హమాస్ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం ఉదయం టెహ్రాన్‌లోని ఇస్మాయిల్ నివాసంపై జియోనిస్టులు జరిపిన దాడిలో ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారని హమాస్ నిర్ధారించింది. పాలస్తీనాలో యూదుల హక్కులు, ప్రత్యేక రాజ్యం కోసం పోరాడుతున్న జియోనిస్టులు జరిపిన ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని హమాస్ తెలిపింది.

కాగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధానికి టెహ్రాన్ వెళ్లారు. సోదరుడు, నాయకుడు, ఉద్యమ అధినేత ఇస్మాయిల్ హనియే ఇరాన్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారని, అనంతరం టెహ్రాన్‌లోని తన ప్రధాన కార్యాలయంలో ఉండగా జియోనిస్టులు చేసిన దాడిలో ఆయన మరణించారని పేర్కొంది.

గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ నరమేధం సృష్టించింది. ఏకంగా 1,195 మంది అమాయక పౌరులను హత మార్చారు. దీంతో ఇస్మాయిల్ హనియేను అంతమొందించి హమాస్ గ్రూపును సమూలంగా తుడిచి పెడతామంటూ ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రతీకారంగా గాజాలో ప్రతీకార సైనిక చర్యలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.


More Telugu News