ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైకోర్టులో ఊరట

  • గతంలో వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు
  • వాలంటీర్ల ఫిర్యాదుతో పవన్ పై గుంటూరులో కేసు నమోదు
  • కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన పవన్
  • కేసు దర్యాప్తుపై స్టే విధించిన ఏపీ హైకోర్టు
గతంలో వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై గుంటూరులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. 

ఈ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగించిన హైకోర్టు... పవన్ కు ఊరట కలిగించింది. కేసు దర్యాప్తుపై స్టే విధించింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, ఇలాంటివే మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని వాదనల సందర్భంగా అడ్వొకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. 

గతేడాది జులై 9న ఏలూరులో జరిగిన వారాహి సభలో పవన్ వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, మహిళల అక్రమ రవాణాలో సంఘ వ్యతిరేక శక్తులకు వాలంటీర్ల నుంచి సహకారం అందుతోందని పవన్ ఆరోపించారు. దాంతో వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో పవన్ పై కేసు నమోదైంది.


More Telugu News