ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్

అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) జెన్నిఫర్ లార్సన్ నేడు అమరావతి విచ్చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ లతో ఆమె భేటీ అయ్యారు. 

జెన్నిఫర్ లార్సన్ తో సమావేశం సందర్భంగా... అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్ర, సులభతరమైన వీసా విధానం, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

జెన్నిఫర్ లార్సన్ తో భేటీపై నారా లోకేశ్ స్పందిస్తూ... అమెరికా కాన్సులేట్ జనరల్ తో సమావేశం సంతోషం కలిగించిందని తెలిపారు. భారతీయ అమెరికన్లలో తెలుగు ప్రజలు 14 శాతం మంది ఉన్నారని, వారు భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేశారన్న దాంట్లో తనకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. వారు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల సొగసును అమెరికా గడ్డపై సుసంపన్నం చేశారని, మన వైవిధ్యాన్ని, వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారని లోకేశ్ వివరించారు. ఈ బంధాన్ని మరింత విస్తరింపజేయడంలో ఏపీ మరింత కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. 

అటు, ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) జెన్నిఫర్ లార్సన్ తో సమావేశంపై ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆలోచనలు కలబోసుకున్నామని నాదెండ్ల వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో పునర్ నిర్మాణం దిశగా సాగుతున్న ఏపీ అభివృద్ధికి ఉపయోగపడే వ్యాపార అవకాశాలపైనా చర్చించామని తెలిపారు.


More Telugu News