అంతకంతకు పెరుగుతున్న వయనాడ్ మృతుల సంఖ్య... ఎడతెరిపిలేని వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం

  • కేరళలో ప్రకృతి బీభత్సం
  • వర్షాలు, వరదలకు తోడు విరిగిపడుతున్న కొండచరియలు
  • వయనాడ్ లో ఇప్పటివరకు 93 మంది మృతి
  • ఇంకా శిథిలాల కింద అనేకమంది!
ప్రకృతి అందాలకు నెలవైన కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 93 మంది మరణించినట్టు గుర్తించామని కేరళ రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఇంకా 98 మంది ఆచూకీ తెలియరాలేదని పేర్కొంది. 116 మంది గాయపడగా, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. 

కాగా, వయనాడ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దాంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కేరళ పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో డ్రోన్లు, పోలీసు జాగిలాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. 

గత అర్ధరాత్రి వయనాడ్ ప్రాంతంలోని ముండకై వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను చురల్ మల వద్ద ఓ స్కూలు వద్దకు తరలించారు. అయితే తెల్లవారుజామున అక్కడ కూడా కొండచరియలు విరిగిపడడంతో స్కూలులో ఆశ్రయం పొందుతున్నవారు గల్లంతయ్యారు. స్కూలు, పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. 

బురదతో కూడిన వరద ప్రవాహంలో చిక్కుకుని అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అనేకమంది శిథిలాల కింద సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యాహ్నం కూడా ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది.


More Telugu News