నా మూడో దఫా పాలనలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది: ప్రధాని మోదీ

  • సీఐఐ ఆధ్వర్యంలో బడ్జెట్ అనంతర సదస్సు
  • ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ
  • భారత్ 8 శాతం వృద్ధి రేటుతో దూసుకెళుతోందని వెల్లడి
  • మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టీకరణ
ఎన్డీయే 3.0 ప్రభుత్వ పాలనలో భారత్ ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నా మూడో దఫా పాలనలో భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ధీమా వ్యక్తం చేశారు. 

సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) ఆధ్వర్యంలో నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ 8 శాతం వృద్ధి రేటుతో పైపైకి దూసుకెళుతోందని, మన దేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే రోజు ఇంకెంతో దూరం లేదని అన్నారు. 

కరోనా సంక్షోభ సమయంలో అభివృద్ధి గురించి మాట్లాడుకునేవాళ్లమని, భారత్ త్వరలోనే అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుందని తాను ఆనాడు చెప్పినట్టు ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందని వివరించారు. కరోనా మహమ్మారితో యుద్ధం అనంతరం కూడా భారత్ ను ఉన్నత ఎత్తులకు తీసుకెళ్లామని చెప్పారు. 

"ప్రపంచ వృద్ధిలో మన దేశ వాటా 16 శాతం. ప్రస్తుతం మూల ధన వ్యయం 11.11 లక్షల కోట్లుగా ఉంది. గత పదేళ్లలో మూల ధన వ్యయం ఐదు రెట్లు పెరిగింది. పదేళ్ల కాలంలో దేశ బడ్జెట్ ను మూడింతలు చేశాం. నూతన ఆవిష్కరణలతో కొత్త ఒరవడి సృష్టించేందుకు భారత్ పరుగులు తీస్తోంది" అని మోదీ వివరించారు.


More Telugu News