విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

  • భీమిలి తీరంలో సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి శాశ్వత నిర్మాణాలు
  • హైకోర్టు ఆదేశాలతో ప్రహరీ కూల్చేసిన అధికారులు
  • సీజే బెంచ్ ఆదేశాలపై ఏకసభ్య బెంచ్‌ను ఆశ్రయించిన నేహారెడ్డి
  • గత ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చేసిన ఏకసభ్య బెంచ్
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలని నేహ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉన్నంత కాలం తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ బి.కృష్ణమోహన్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నిన్న తేల్చి చెప్పింది.

అయితే, గత ఉత్తర్వుల సవరణ కోసం అభ్యర్థన చేసుకోవచ్చని సూచించింది. కాగా, నేహారెడ్డి వ్యాజ్యంలో విశాఖ జనసేన కొర్పొరేటర్ మూర్తియాదవ్ ప్రతివాదిగా చేరేందుకు అనుమతినిచ్చిన న్యాయస్థానం కౌంటర్ దాఖలుకు ఆదేశిస్తూ విచారణను వారం రోజులు వాయిదా వేసింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. భీమిలి బీచ్ సమీపంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలు ఉల్లంఘించి శాశ్వత నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ మూర్తియాదవ్ గతంలో సీజే ధర్మాసనం ముందు పిల్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు నిర్మాణాలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఏకసభ్య ధర్మాసనాన్ని నేహారెడ్డి ఆశ్రయించగా అక్కడ కూడా ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.


More Telugu News