కేరళలో కొండచరియలు విరిగిపడి 19 మంది దుర్మరణం

  • మెప్పాడికి సమీపంలో భారీగా విరిగిపడిన కొండచరియలు
  • వందలాది సంఖ్యలో జనాలు చిక్కుకొని ఉండొచ్చని అనుమానాలు
  • ముమ్మరంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
కేరళలోని వయనాడ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని మెప్పాడికి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాతపడ్డారు. వందలాది మంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారిని కాపాడడానికి పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మంత్రులు కూడా అక్కడికి వెళ్తున్నారంటూ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 

కాగా కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. అదనపు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి బయలుదేరాయి. కాగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

సీఎం పినరయికి మోదీ ఫోన్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ బీజేపీ కార్యకర్తలను ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా కోరారు.


More Telugu News