ఝార్ఖండ్‌ లో రైలు ప్రమాదం.. ఒకరి మృతి.. 60 మందికి గాయాలు

ఝార్ఖండ్‌ లో మరో రైలు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని చక్రధర్‌పూర్‌కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. సుమారు 60 మంది గాయపడినట్టు సమాచారం.

ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, రైల్వే ఉద్యోగులు చురుగ్గా రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నారు. కాగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వ్యాగన్‌లను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

రైల్వే సమాచారం ప్రకారం హౌరా నుంచి ముంబై వెళ్తున్న రైలు సోమవారం రాత్రి 11:02 గంటలకు టాటానగర్‌కు చేరుకోవాల్సి ఉండగా.. చాలా ఆలస్యంగా రాత్రి 2:37 గంటలకు చేరుకుంది. 2 నిమిషాలు ఆగిన తర్వాత తదుపరి స్టేషన్ చక్రధర్‌పూర్‌కి బయలుదేరింది. అయితే స్టేషన్‌కు చేరుకోక ముందే ప్రమాదానికి గురైంది.


More Telugu News