సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్

  • కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందన్న డీకే సురేశ్
  • ఇది ఇలాగే కొనసాగితే దేశ విభజన డిమాండ్లు తప్పవని హెచ్చరిక
  • ఇప్పటికే తమిళనాడులో డిమాండ్లు మొదలయ్యాయని వ్యాఖ్య   
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం తన వివక్షను ఇంకా కొనసాగించాలనుకుంటే, దేశ విభజనకు సంబంధించిన డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. 

బెంగళూరులోని తన నివాసంలో డీకే సురేశ్ మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. తాను ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని స్పష్టం చేశారు. 

కేంద్రం దక్షిణాది రాష్ట్రాల పట్ల అసంబద్ధ రీతిలో వ్యవహరిస్తోందని, కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతే, దేశ విభజన చేయాలన్న నినాదాలు భవిష్యత్తులో వినాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఉద్యమం తమిళనాడులో ఇప్పటికే ప్రారంభమైందని డీకే సురేశ్ తెలిపారు. 

బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలు, గుజరాత్ అధిక ప్రాధాన్యత పొందాయి... మరి అదే ప్రాధాన్యతను పొందే అర్హత దక్షిణాది రాష్ట్రాలకు లేదా? అని డీకే సురేశ్ ప్రశ్నించారు. మేమేమీ బిచ్చమెత్తడం లేదు, రాష్ట్ర ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతున్నాం అని స్పష్టం చేశారు.


More Telugu News