పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు

  • నేడు గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం
  • పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఎన్నికల హామీ నెరవేరుస్తూ... చంద్రబాబు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. అటు, పట్టణాల్లో కొత్త లబ్ధిదారులకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. 

దీనిపై మంత్రి పార్థసారథి స్పందిస్తూ, రాబోయే వంద రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు.

గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కనబెట్టిందని ఆరోపించారు. ఇళ్లు పూర్తయినా చెల్లింపులు చేయని వారికి చెల్లింపులు జరపాల్సి ఉందని వివరించారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. విలేకరులకు తక్కువ ధరలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. 

కాగా, ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణం అంశాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించడంపైనా చర్చ జరిగినట్టు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోట సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 

గత ప్రభుత్వ నిర్వాకంతో ఒక్క గృహ నిర్మాణ శాఖలోనే రూ.10 వేల కోట్లు నష్టపోయినట్టు తెలిపారు.


More Telugu News