మా హౌస్ పేరుతో అసత్య ప్రచారం... నమ్మకండి: అన్నపూర్ణ స్టూడియోస్

  • కొత్త నటీనటుల ఎంపిక అంటూ వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దన్న అన్నపూర్ణ స్టూడియోస్
  • ఇలాంటి వాటి బారిన పడవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచన
  • ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు
తమ ప్రొడక్షన్ హౌస్ పేరుపై కొత్త నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థకు నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. అగ్ర నిర్మాణ సంస్థల పేరు చెప్పి అవకాశాలు ఇస్తామని చెబుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేస్తున్నారు.

ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఓ ఫేక్ ప్రకటన వచ్చింది. హీరో, హీరోయిన్, ఫ్రెండ్స్, సిస్టర్స్, చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఇలా పలు క్యారెక్టర్లకు నటీనటులు కావాలంటూ అన్నపూర్ణ స్టూడియో పేరుతో ప్రకటన విడుదలైంది. అయితే ఇది ఫేక్ అని ఈ నిర్మాణ సంస్థ నేడు ప్రకటన విడుదల చేసింది.

తమ ప్రొడక్షన్ హౌస్ పేరుతో కొత్త నటీనటుల ఎంపిక అంటూ వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. ఇలాంటి వాటి బారిన పడవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించింది. డబ్బులు పంపించవద్దని తెలిపింది. ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏ సమాచారమైనా అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలు, వెబ్ సైట్ ద్వారా పంచుకుంటామని తెలిపింది.


More Telugu News