ఢిల్లీలో వరదల వల్ల విద్యార్థుల మృతి... సీజేఐకి సివిల్స్ విద్యార్థి లేఖ

  • ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ చదవడం తమ హక్కు అని లేఖ
  • నీటి ఎద్దడి, వరదల కారణంగా విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆందోళన
  • ముగ్గురు విద్యార్థుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
వరదల కారణంగా ఢిల్లీలో ముగ్గురు సివిల్స్ ఆశావహుల మృతి నేపథ్యంలో, వారి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సివిల్స్ విద్యార్థి ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. సివిల్స్ విద్యార్థి అవినాశ్ దుబే ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సెంటర్‌లో ఉన్న లోపాలను లేఖలో వివరించారు. 

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ విద్యను అభ్యసించడం తమ ప్రాథమిక హక్కు అని అన్నారు. నీటి ఎద్దడి, వరదల కారణంగా విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం అవసరమన్నారు. అప్పుడే నిరభ్యంతరంగా చదువుపై దృష్టి సారించగలమని... దేశ అభివృద్ధిలో భాగస్వాములం కాగలమన్నారు.

తమతో పాటు పరిసర ప్రాంతాల్లోని పేలవమైన మౌలిక సదుపాయాల గురించి వెల్లడించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వర్షాలు కురిసినప్పుడల్లా ఢిల్లీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్లను లైబ్రరీలుగా మార్చారన్నారు. అందుకే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు. తామంతా నరకంలో జీవిస్తున్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


More Telugu News