సీఎం రేవంత్ రెడ్డి మీద హరీశ్ రావు ఆరోపణలు... కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం

  • బీఆర్ఎస్ పుట్టిందే అబద్దాల మీద అని ఆరోపణ
  • హరీశ్ రావు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శ
  • జైపాల్ రెడ్డి గురించి మాట్లాడే అర్హతలేని వ్యక్తి హరీశ్ రావు అని మండిపాటు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద హరీశ్ రావు అనేక ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే విజయరమణారావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి సభను డైవర్ట్ చేస్తున్నారనడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే అబద్దాల మీద అని ఆరోపించారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డలలో బుంగలు ఏర్పడి పగుళ్లు వస్తే సందర్శనకు ఎవరినీ అనుమతించలేదన్నారు. హరీశ్ రావు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు.

జైపాల్ రెడ్డి గురించి మాట్లాడే అర్హతలేని వ్యక్తి హరీశ్ రావు అని విమర్శించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి  భూపాలపల్లిలో కనీసం ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని మరో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. విద్యుత్ రంగంలో క్లర్క్‌గా పని చేసిన వ్యక్తిని సీఎండీగా చేసి ఛత్తీస్‌గఢ్‌తో కరెంట్ కొనుగోలు ఒప్పందాలు చేసుకొని అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు.

పదేళ్ల పాటు పోలీస్ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీసిందని ఎమ్మెల్యే నాగరాజు మండిపడ్డారు. అనవసరంగా పోలీస్ శాఖ మీద దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. జగదీశ్ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ పూర్తి చేయలేదని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ విమర్శించారు. ఈ ప్రాజెక్టుల అంచనాలను వేలకోట్లు పెంచారన్నారు.


More Telugu News