మీ శరీరంలో అణువణువు పిరికితనమే... అసెంబ్లీకి వెళ్లి పోరాడడం మీకు చేతకాదు: జగన్ పై షర్మిల ఫైర్

  • షర్మిలను విమర్శిస్తూ వైసీపీ ట్వీట్
  • ఘాటైన విమర్శలతో రిప్లయ్ ఇచ్చిన షర్మిల
  • అందుకే మిమ్మల్ని అద్దంలో చూసుకోమని చెప్పింది అంటూ వ్యాఖ్యలు
  • జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు అని పునరుద్ఘాటన
  • మీకు మీడియా పాయింటే ఎక్కువ అంటూ వ్యంగ్యం
జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని తాను చెబితే...  అది చంద్రబాబుకు కొమ్ముకాసినట్టు మీకు అనిపిస్తోందా? అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి... అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే... మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది... అద్దంలో ఇప్పుడు కూడా మీకు చంద్రబాబే కనిపిస్తున్నట్టుంది అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. 

"సోషల్ మీడియాలో నన్ను అవమానించేంత ద్వేషం మీకుంది... అలాంటి ద్వేషం మాకు లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది. అది అధికార పార్టీనా, లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అని చెప్పాం. చట్ట సభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయాలని అన్నాం. 

వైఎస్సార్ విగ్రహాలు కూల్చివేస్తే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ వర్గాలను హెచ్చరించింది నేనే. మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఇవాళ వైఎస్సార్ కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. 

వైసీపీలో వైఎస్సార్ ను, విజయమ్మను అవమానించినవారే పెద్దవాళ్లుగా చెలామణీ అవుతున్నారు కదా. YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు... ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే. 

వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడడం మీకు చేతకాదులే... మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువు పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమసంబంధం పెట్టుకున్నారు. 

వైఎస్సార్ ను వ్యతిరేకించిన బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు... మీ అహంకారమే మీ పతనానికి కారణం" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. 

'చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతిక్షణం ఆలోచించేవారికి తేడా ఉంటుంది షర్మిల గారూ' అంటూ వైసీపీ చేసిన ట్వీట్ కు షర్మిల పైవిధంగా స్పందించారు.


More Telugu News