వన్డే సిరీస్ కోసం శ్రీలంక చేరుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆగస్టు 2 నుంచి జరగనుంది. ప్రస్తుతం టీ20 సిరీస్ ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ రేపు (జులై 30) జరగనుంది. ఈ సిరీస్ ముగియగానే వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. 

ఈ నేపథ్యంలో, శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ కొలంబో చేరుకున్నారు. వీరితో పాటు కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా కూడా శ్రీలంకలో అడుగుపెట్టారు. వీరంతా గతరాత్రి కొలంబో ఎయిర్ పోర్టు నుంచి ఐటీసీ రత్నదీప హోటల్ కు తరలి వెళ్లారు. 

వన్డే సిరీస్ లో పాల్గొనే టీమిండియా జట్టు ఆటగాళ్లు నేటి నుంచి నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు. టీమిండియా వన్డే జట్టులోని మిగతా ఆటగాళ్లు శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టుతో కలవనున్నారు. టీమిండియా సెలెక్టర్లు శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్ లకు రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే


More Telugu News