ముగ్గురిని బలితీసుకున్న ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లోకి ఉద్ధృతంగా వరద నీరు.. వీడియో ఇదిగో!

  • కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి పోటెత్తిన వరద నీరు
  • లైబ్రరీ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు
  • వేగంగా.. అంటూ అరుపులు
  • నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో లైబ్రరీ
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి ఒక్కసారిగా పోటెత్తిన వరద నీరు ముగ్గురిని బలితీసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్‌లో నిర్వహిస్తున్న లైబ్రరీలో ఉన్న విద్యార్థుల్లో ముగ్గురు వరద నీటిలో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. వీరిలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తానియా సోని (25) కూడా వీరిలో ఉన్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో వరద నీరు ఉద్ధృతంగా బేస్‌మెంట్‌లోకి దూసుకెళ్తోంది. దీంతో భయపడిన విద్యార్థులు బేస్‌మెంట్ నుంచి బయటకు వస్తూ.. ‘త్వరగా.. త్వరగా.. కింద ఇంకా ఎవరైనా ఉన్నారా?’ అనడం వీడియోలో వినిపిస్తోంది. ఏడు గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత తానియా సహా శ్రేయా యాదవ్ (25), నవీన్ డెల్విన్ (28) మృతదేహాలను వెలికి తీశారు. 

 బేస్‌మెంట్ నుంచి నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. భవనం నిర్మాణంలోనూ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలింది. ప్రస్తుతం లైబ్రరీగా ఉపయోగిస్తున్న బేస్‌మెంట్‌ను స్టోర్‌రూమ్‌గా ఉపయోగించుకుంటామని అనుమతులు తీసుకున్నట్టు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) చెబుతోంది. అలాగే, అగ్నిమాపక శాఖ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ కూడా తీసుకోలేదని వెల్లడైంది.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌస్ స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా, కో ఆర్డినేటర్ దేశ్‌పాల్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది.


More Telugu News