గీత దాటొద్దు.. ఆర్. అశ్విన్‌కు బౌలర్ వార్నింగ్.. వీడియో ఇదిగో!

  • తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ మ్యాచ్‌లో ఆదివారం ఘటన
  • దిండిగల్ డ్రాగన్స్ వర్సెస్ నెల్లాయ్ రాయల్ కింగ్స్‌ మ్యాచ్‌లో నిబంధన ఉల్లంఘించబోయిన అశ్విన్
  • బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని అశ్విన్ క్రీజ్ దాటి పరుగు తీసే ప్రయత్నం
  • మధ్యలోనే బౌలింగ్ ఆపిన బౌలర్ ప్రశాంత్, ఘటనను అంపైర్ దృష్టికి తీసుకెళ్లిన వైనం
భారత్‌కు అనేక విజయాలు అందించిన దిగ్గజ బౌలర్ ఆర్. అశ్విన్‌ నిబంధనల విషయంలో కచ్చితంగా ఉంటాడని పేరు. గతంలో రూల్స్ పాటించని ప్రత్యర్థి క్రీడాకారులను పట్టుబట్టి మరీ ఔట్‌గా డిక్లేర్ చేయించాడు. తన బౌలింగ్‌లో నాన్‌స్ట్రైకర్ వైపున ఉన్న ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ బంతివేయక ముందే క్రీజ్ దాటినందుకు ఔట్ చేయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఆర్.అశ్విన్‌ ఇదే తప్పు చేయబోయి ఇరుక్కుపోయాడు. ఇందుకు సంబంధించిన ఆసక్తికర వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం దిండిగల్ డ్రాగన్స్, నెల్లాయ్ రాయల్ కింగ్స్ తలపడ్డాయి. డ్రాగన్స్ జట్టు తొలి ఓవర్‌లో ఎస్. మోహన్ ప్రశాంత్ బౌలింగ్‌కు దిగాడు. అతడు బౌలింగ్ చేసే క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అశ్విన్.. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ దాటే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ప్రశాంత్ బంతి వేయడం ఆపి అశ్విన్‌ను హెచ్చరించాడు. విషయం అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. దిగ్గజ క్రీడాకారుడికి ప్రశాంత్ ఇలా ముచ్చెమటలు పట్టించిన వైనం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

మరోవైపు, భారత్ శ్రీలంకపై వరుసగా రెండో టీ20 విజయాన్ని నమోదు చేసింది. పల్లెకెలె వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. ఆ తర్వాత వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. దీంతో, డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయ లక్ష్యాన్ని అంపైర్లు 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించగా భారత్ సునాయాస విజయం అందుకుంది.


More Telugu News