ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత మను భాకర్‌కు ప్రధాని మోదీ ఫోన్

  • ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన ప్రధాని
  • 0.1 పాయింట్ల తేడాతో రజతాన్ని కోల్పోయినా దేశం గర్వం పడేలా చేశావని ప్రశంసలు
  • మిగతా ఈవెంట్లలో కూడా రాణించాలని అభిలషించిన ప్రధాని మోదీ
పారిస్ ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక రీతిలో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకం అందించిన షూటర్ మను భాకర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ ఈవెంట్‌లో భారత్‌కు మెడల్ అందించిన ఏకైక మహిళగా రికార్డులకెక్కిన ఆమె పట్ల అభినందనలు వెల్లువెత్తున్నాయి. నేరుగా ప్రధామంత్రి నరేంద్ర మోదీ కూడా ఫోన్ కాల్ చేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.  

‘‘ మను నీకు అభినందనలు. నీ విజయం పట్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. కేవలం 0.1 పాయింట్ల తేడాతో నువ్వు రజత పతకాన్ని కోల్పోయావు. అయినా దేశాన్ని గర్వించేలా చేశావు. రెండు విధాలుగా ప్రశంసలు పొందుతున్నావు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచావు. టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్ నీకు ద్రోహం చేసింది. అయితే ఈసారి అన్ని అవరోధాలను అధిగమించావు. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో ఇతర అన్ని విభాగాల్లో కూడా బాగా రాణిస్తావని నేను ఆశిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ తన సందేశాన్ని ఇచ్చారు. 

ఇక భారత అథ్లెట్లకు అక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయని తాను భావిస్తున్నానని అన్నారు. పతకం సాధించిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం దొరికిందా? అని మోదీ ఆమెను ప్రశ్నించారు. ఇక మను కలలను నిజం చేయడంలో ఎంతగానో సాయం చేసిన ఆమె కుటుంబ సభ్యులను కూడా మోదీ ప్రశంసించారు. మను కుటుంబ సభ్యులకు కూడా ఈ విజయం ఎంతో గర్వకారణమని మెచ్చుకున్నారు. కాగా పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ కేటగిరిలో మను భాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. ఆదివారం సాధించిన ఈ విజయంతో దేశం గర్వించింది.


More Telugu News