ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన మను బాకర్ కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్

  • పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన మను బాకర్
  • 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్రీడాంశంలో కాంస్యం
  • ఒలింపిక్స్ షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు
హర్యానా అమ్మాయి మను బాకర్ పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించడం తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ అంశంలో మను బాకర్ మూడో స్థానంలో నిలిచి పతకం చేజిక్కించుకుంది. తద్వారా, ఒలింపిక్స్ షూటింగ్ క్రీడాంశంలో పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. దాంతో, ఈ యువ షూటర్ పై అభినందనల వర్షం కురుస్తోంది. 

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా మను బాకర్ సాధించిన ఘనత పట్ల స్పందించారు. " ఒలింపిక్స్ లో షూటింగ్ క్రీడలో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళగా అవతరించినందుకు మను బాకర్ కు శుభాభినందనలు. అంతేకాదు, మను బాకర్ సాధించిన కాంస్యం పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం" అని సీఎం చంద్రబాబు వివరించారు. 

మంత్రి నారా లోకేశ్ కూడా ట్వీట్ చేశారు. "పారిస్ ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి తొలి పతకం అందించిన మను బాకర్ కు అభినందనలు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్రీడాంశంలో మను బాకర్ సాధించిన కాంస్యం స్ఫూర్తిగా మన క్రీడాకారులు ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను" అని నారా లోకేశ్ పేర్కొన్నారు. 



More Telugu News