అదరహో రమిత.. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఉమెన్స్ ఎయిర్ రైఫిల్‌లో ఫైనల్లో అడుగు

  • 631.5 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచిన రమిత
  • రేపు జరగనున్న ఫైనల్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భారత అథ్లెట్
  • తృటిలో అర్హత కోల్పోయిన ఎలవెనిల్ వలరివన్
పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా భారత షూటర్లు వేటకొనసాగిస్తున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రమితా జిందాల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 631.5 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచి అర్హత సాధించింది. 104.3, 106.0, 104.9, 105.3, 105.3, 105.7 చొప్పున స్కోర్లు సాధించింది. 2022లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో రమితా జిందాల్ అదరగొట్టింది. రెండు పతకాలు సాధించిన ఆమె ప్రస్తుత ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపింది.

కాగా ఇదే ఈవెంట్‌లో భారత్‌కే చెందిన ఎలవెనిల్ వలరివన్ తృటిలో ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుంది. అతి తక్కువ తేడాతో ఆమె ఫైనల్ ఛాన్స్‌ను కోల్పోయింది. 630.7 స్కోర్‌తో 10వ స్థానానికి పరిమితమైంది. తొలి 8 స్థానాల్లో నిలిచిన షూటర్లు రేపు (సోమవారం) జరిగే ఫైనల్‌లో పోటీపడతారు.

కాగా శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రమితా జిందాల్, వలరివాన్ ఇద్దర విఫలమయ్యారు. అయితే ఈ రోజు జరిగిన వ్యక్తిగత ఈవెంట్‌లో ఇద్దరూ చక్కటి ప్రతిభ కనబరచడం విశేషం.


More Telugu News