బాధ్యతా రాహిత్యమే ఆ మరణాలకు కారణం.. రాహుల్​ గాంధీ

  • ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ లోకి పోటెత్తిన వరద
  • నీట మునిగి ముగ్గురు అభ్యర్థులు మృతి చెందడంపై రాహుల్ స్పందన
  • ఇది వ్యవస్థల వైఫల్యం అని వ్యాఖ్య
ఢిల్లీలో భారీ వర్షాలతో ఓ సివిల్స్‌ కోచింగ్ సెంటర్ లోకి వరద పోటెత్తి.. ముగ్గురు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యమే ఈ దారుణానికి కారణమని ఆయన పేర్కొన్నారు. పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, భద్రత లేని నిర్మాణం వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. మృతి చెందిన ముగ్గురు అభ్యర్థుల కుటుంబాలకు రాహుల్‌ సానుభూతి తెలిపారు. దీనిపై తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

సురక్షితంగా జీవించడం అందరి హక్కు
‘ఢిల్లీలోని ఓ భవనం బేస్‌ మెంట్‌లోకి వరద నీరు చేరి.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం దురదృష్టకరం. కొన్ని రోజుల క్రితం వర్షాల వల్ల కరెంట్ షాక్ కు గురై ఒక విద్యార్థి మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యమే. సంస్థల బాధ్యతా రాహిత్యం వల్ల సాధారణ ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సురక్షితంగా జీవించడం దేశంలోని ప్రతీ పౌరుడి హక్కు. దాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత’ అని రాహుల్ పేర్కొన్నారు.


More Telugu News