ఢిల్లీలో భారీ వర్షాలు.. వరదకు నీట మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్.. విద్యార్థి మృతి

  • రాజేందర్‌నగర్‌లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద
  • వరదలో చిక్కుకుపోయిన విద్యార్థులు,
  • రంగంలోని ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు, ఓ విద్యార్థి మృతదేహం వెలికితీత
  • పరారీలో కోచింగ్ సెంటర్ యజమాని, ప్రమాదానికి ఆప్ బాధ్యత వహించాలన్న బీజేపీ
భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న ఢిల్లీలో మరో విషాదం చోటుచేసుకుంది. అక్కడి రాజేందర్ నగర్‌లోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఓ విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. ఇతరుల కోసం గాలిస్తున్నారు. ఫైర్ డిపార్ట్‌మెంట్, ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఢిల్లీ పోలీసులు విద్యార్థులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, బేస్‌మెంట్‌లో వెలుతురు లేకపోవడం, నీరు నిండిపోవడం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. కోచింగ్ సెంటర్ ఓనర్ పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా సీనియర్ అధికారులు ఘటనా స్థలంలోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

ప్రమాదంపై ఢిల్లీ మంత్రి ఆతిషీ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరగాలని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు. ప్రమాదంపై 24 గంటల్లోగా నివేదిక సిద్ధం చేయాలని కూడా అన్నారు. 

ఘటనపై మరో అధికారి స్వాతి మలివాల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలో చిక్కుకుని ఓ ఐఏఎస్ విద్యార్థి మృతి చెందడం దురదృష్టకరమని, విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులెవరో తేల్చి చర్యలు తీసుకోవాలని అన్నారు. 

కాగా, ఘటనాస్థలానికి చేరుకున్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, ఎంపీ బాన్సురీ స్వరాజ్.. ఈ ప్రమాదానికి ఆప్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నాలాలు సరిగా శుభ్రపరచకపోవడంతోనే నీరు ఎగదన్ని బేస్‌మెంట్‌లోకి వరద పోటెత్తిందని అన్నారు. నేరపూరిత నిర్లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వమే ఈ ప్రమాదానికి కారణమైందని దుయ్యబట్టారు. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ వాటర్ బోర్డు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News