‘ఎస్-400 ఎయిర్‌ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్’ పనితీరు అమోఘం.. ఐఏఎఫ్ కసరత్తులో అద్భుత ఫలితం

  • శత్రు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్యాకేజీలో 80 శాతం కూల్చివేత
  • మిగతా విమానాలను సైతం తిప్పికొట్టిన ఎస్-400 వ్యవస్థ
  • వాయు సేనలో ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ సంపూర్ణ ఏకీకరణ
రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన సుదర్శన్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ పనితీరు అమోఘం అనిపిస్తోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) కసరత్తులో ఎస్-400 భారీ విజయాన్ని నమోదు చేసింది. శత్రువు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్యాకేజీలో ఏకంగా 80 శాతం విమానాలను కూల్చివేసింది. ప్యాకేజీలోని మిగతా విమానాలను సైతం విజయవంతంగా వెనక్కి తరిమికొట్టింది. మొత్తంగా శత్రువు తన మిషన్లను నిలిపివేసేలా ఎస్-400 సమర్థవంతంగా పనిచేసింది. తన అమ్ములపొదిలోని లాంగ్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్‌ను మోహరించి ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి.

వాయు సేనలో ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ సంపూర్ణ ఏకీకరణను చాటిచెప్పడమే లక్ష్యంగా ఎయిర్‌ఫోర్స్ ఈ కసరత్తు నిర్వహించినట్టు సంబంధిత వర్గాలు వివరించాయి. ఎస్-400 ఆయుధ వ్యవస్థ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిజమైన యుద్ధ విమానాలను ఉపయోగించినట్టు పేర్కొన్నాయి.

ఈ కసరత్తుతో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ భారత వైమానిక దళ వ్యవస్థతో సంపూర్ణంగా ఏకీకృతం అయింది. ఇప్పటికే మూడు ఎస్-400 స్క్వాడ్రన్లు వాయు సేనలో భాగమవ్వగా.. 2026లో మరో రెండు రష్యా నుంచి భారత్‌కు అందుతాయని అంచనాగా ఉంది. ఎస్-400 సిస్టమ్‌ల సరఫరాను వేగవంతం చేయాలని ఇటీవల కూడా రష్యాను భారత్ కోరింది. 

కాగా ఎస్-400 ఐదు స్క్వాడ్రన్‌ల కొనుగోలుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ ఏకంగా రూ.35,000 కోట్లకు పైమాటే. ఈ మేరకు ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఇటీవలే స్వదేశీ ఎంఆర్-ఎస్ఏఎం, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలతో పాటు ఇజ్రాయెల్ తయారీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణ వ్యవస్థలను సమకూర్చుకున్న భారత వాయు సేన.. ఎస్-400 కూడా పూర్తి స్థాయిలో చేరితే ఒక గేమ్ ఛేంజర్‌లా మారడం ఖాయమని విశ్వసిస్తోంది.

కాగా ఎస్-400 ఎయిర్‌ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్‌ను ప్రస్తుతం ‘సుదర్శన్’గా పిలుస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడి చేతిలోని ‘సుదర్శన చక్రం’ స్పురించేలా ఈ పేరు పెట్టారు.


More Telugu News