147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కనీవినీ ఎరుగని చెత్త రికార్డ్ నమోదు

  • ఐర్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 42 బై రన్స్‌ ఇచ్చిన జింబాబ్వే వికెట్ కీపర్ క్లైవ్ మదండే
  • సొంత తప్పిదాలతో పాటు బౌలర్ల పొరపాటుతో అవాంఛిత రికార్డు నమోదు
  • 1934లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ నెలకొల్పిన 37 బై రన్స్ రికార్డు బ్రేక్
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే వికెట్ కీపర్ క్లైవ్ మదండే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 42 బై రన్స్ సమర్పించుకున్నాడు. దీంతో అతడి పేరిట అవాంఛిత రికార్డు నమోదయింది. ఐర్లాండ్‌లోని స్టోర్‌మాంట్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో క్లైవ్ మదండే ఈ మేరకు భారీగా పరుగులు వదిలిపెట్టాడు. అయితే బై రన్స్ మొత్తానికి అతనొక్కడే కారణం కాదు. జింబాబ్వే బౌలర్ల పొరపాట్లు కూడా ఇందుకు కారణమయ్యాయి. కొందరు లెగ్‌సైడ్‌ వికెట్‌కు దూరంగా బంతులు వేయడం, కొన్ని బంతులు బ్యాట్స్‌మెన్‌ను దాటిన తర్వాత ఆలస్యంగా స్వింగ్ కావడంతో వాటిని మదండే అందుకోలేకపోయాడు. అయితే కొన్ని బై రన్స్ అతడి తప్పిదాల వల్లేనే ప్రత్యర్థి జట్టుకు వెళ్లాయి. 

1934లో ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కీపర్ లెస్ అమెస్ చేజార్చిన 37 బై రన్స్ వికెట్ కీపర్ చెత్తరికార్డుగా ఉండేవి. ఆ రికార్డును మదండే బ్రేక్ చేశాడు. కాగా క్రికెట్ హిస్టరీలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో లెస్ అమెస్ ఒకడు కావడం విశేషం.

కాగా జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసి 210 పరుగులకు ఆలౌట్ అయింది. ఐర్లాండ్ 250 పరుగులు చేయడంతో ఆ జట్టుకు 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ 40 పరుగులు కీపర్ సమర్పించిన బైరన్స్‌తో సమానం కావడం గమనార్హం. ఇక 24 ఏళ్ల క్లైవ్ మదండే బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయాడు. డకౌట్‌గా పెవీలియన్‌కు చేరి నిరాశపరిచాడు.


More Telugu News