బడ్జెట్‌లో మీరు ఏయే జిల్లాల పేర్లు పలికారో చెప్పండి: కాంగ్రెస్‌కు బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్

  • కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదం వాడలేదని విమర్శించడం సరికాదన్న పాయల్ శంకర్
  • రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లెక్కలు గారడిలా ఉన్నాయని విమర్శ
  • పాయల్ శంకర్ బడ్జెట్ విషయంలో కేంద్రం పక్షాన మాట్లాడటం సరికాదన్న సీతక్క
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదం వాడలేదని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని, అలాంటప్పుడు రాష్ట్ర బడ్జెట్‌లో మీరు ఏయే జిల్లాల పేర్లు పలికారో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ లెక్కలు గారడిలా ఉన్నాయని విమర్శించారు. అందమైన పెద్ద పెద్ద పదాలు, అంకెలతో బడ్జెట్‌ను తయారు చేశారన్నారు.

గ్రామపంచాయతీలు నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసన సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాను అమలు చేస్తానని చెప్పిందని, కానీ జులై ముగుస్తున్నప్పటికీ ఇంకా అమలు చేయడం లేదని విమర్శించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కార్పోరేషన్ ద్వారా నిధులు దొరికేవని... పదేళ్లుగా కార్పోరేషన్‌లకు నిధులు లేవని ఆరోపించారు.

తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు: సీతక్క

ఎమ్మెల్యే శంకర్ బడ్జెట్ విషయంలో కేంద్రం పక్షాన మాట్లాడటం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. వారు మన వద్ద అక్షింతలు పంచారు తప్పితే తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. నల్ల చట్టాలు కాదు... రైతులకు మద్దతు ధర ఇచ్చే చట్టాలను తీసుకు రావాలన్నారు.


More Telugu News