బడ్జెట్ ప్రకటన తర్వాత దిగివస్తున్న పసిడి ధరలు.. 3 రోజుల్లో గణనీయ తగ్గుదల

  • మూడు రోజుల్లో ఏకంగా రూ.5000 తగ్గిన 10 గ్రాముల బంగారం ధర
  • వెండి ధరలోనూ భారీ తగ్గుదల
  • బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకం తగ్గింపుతో  తగ్గుతున్న ధరలు
కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. బడ్జెట్ ప్రకటన వెలువడిన మూడు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 7 శాతం లేదా రూ.5000 మేర దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో రూ.75,000 ఎగువున ఉన్న 10 గ్రాముల బంగారం ధర బడ్జెట్ ప్రకటన తర్వాత రూ.70,650 స్థాయికి తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా రూ.84,000 స్థాయికి పడిపోయింది. ధరలు తగ్గుదలను కొనుగోలుదారులు కూడా స్వాగతిస్తున్నారు.

ధరలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుండడంతో ఆభరణాల కొనుగోలు డిమాండ్ కూడా పెరిగింది. తిరిగి బంగారాన్ని కొనేందుకు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య  పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పండగల సీజన్‌కు ముందు ధరల తగ్గుదల తమకు కలిసి రావడం ఖాయమని, ఆభరణాల విక్రయాలకు మరింత ఊతం ఇస్తుందని పీసీ జ్యువెలర్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ గార్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కస్టమ్స్ సుంకం తగ్గింపుతో బంగారం దిగుమతులు చౌకగా మారాయి. ఈ నిర్ణయం బంగారం అక్రమ రవాణాకు కూడా అడ్డుకట్ట వేయగలదనే అంచనాలున్నాయి. వ్యవస్థీకృత ఆభరణాల రంగానికి లబ్ది చేకూరుతుందని, బంగారంపై పెట్టుబడులు కూడా పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారాన్ని ఒక ఆస్తిగా ప్రోత్సహించేలా ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.  

బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో ధరలు గణనీయంగా తగ్గాయని ఎల్‌కేజీ సెక్యూరిటీస్‌ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది పేర్కొన్నారు. బంగారం అక్రమ రవాణాను అరికట్టడానికి, సంఘటిత రంగానికి మేలు ప్రయోజనం చేయాలనే దీర్ఘకాలిక డిమాండ్లను ప్రభుత్వ నిర్ణయం పరిష్కరిస్తుందని విశ్లేషించారు.


More Telugu News