కుప్పంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

  • కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి
  • ఎన్టీఆర్ ట్రస్టు తరఫున కుప్పంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు
  • చంద్రబాబు స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్టును ముందుకు తీసుకెళుతున్నామన్న భువనేశ్వరి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆమె కుప్పంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని మహిళల కోసం ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఈ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. నేడు ఈ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బంది కూడా పాల్గొన్నారు. 

ప్రారంభోత్సవం సందర్భంగా నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తండ్రి, దివంగత ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ముందుకు కొనసాగుతుందని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టును చంద్రబాబు సేవా భావంతో స్థాపించారని వెల్లడించారు.

"చంద్రబాబు ఏ స్ఫూర్తితో ట్రస్టును స్థాపించారో... ఆ స్ఫూర్తిని నేను, నా సిబ్బంది ముందుకు తీసుకెళుతున్నాం. కుప్పంలో ఈ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ మహిళా సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు చేశాం. మహిళలకు బట్టలు కుట్టడం నేర్పిస్తే వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడతారని మేం భావిస్తున్నాం. 

కేవలం కుట్టు మిషన్లతోనే మేము ఈ కార్యక్రమాలు ఆపడం లేదు... మరిన్ని ఆలోచనలు ఉన్నాయి. దుస్తుల ఫ్యాక్టరీల వారితో మాట్లాడుతున్నాం... వారికి ఏ మోడల్ దుస్తులు కావాలో వాటిని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లో శిక్షణ పొందిన వారితో కుట్టించి ఫ్యాక్టరీకి అమ్మేలా చర్యలు తీసుకుంటున్నాం. 

అంతేకాదు... వైర్ బుట్టలు, ఇతర చేతి పనుల్లో ఏమైతే మహిళలకు ఆసక్తి ఉంటుందో వాటిలో కూడా శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళతాం. శిక్షణ తీసుకున్న మహిళలకు కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి వారిని మరింత ముందుకు తీసుకెళతాం. మహిళలు తమ సంపాదనపై సంతృప్తి చెందేలా మేం చర్యలు తీసుకుంటాం. సంతృప్తికర స్థాయిలో సంపాదించేలా చర్యలు తీసుకుంటాం. 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. మహిళలకు బాసటగా నిలబడతాం. కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్కూలు ఏర్పాటు చేస్తాం. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం. 

కుప్పం నియోజకవర్గంలో నిరుద్యోగ మహిళలకు ఉపయోగపడేలా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ లో పెట్టిన విధంగా ఉచిత ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను కుప్పంలో పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం" అని భువనేశ్వరి వివరించారు.


More Telugu News