మాకు న్యాయం చేయండి... టీడీపీ ప్రజాదర్బార్ కు పోటెత్తిన ప్రజలు

  • మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్
  • ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అనగాని, బీదా రవిచంద్రయాదవ్
  • వినతుల్లో 90 శాతం భూ అక్రమాలకు సంబంధించినవే!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. 

వీటిల్లో అత్యధిక భాగం గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తమకు అన్యాయం జరిగిందంటూ వచ్చిన వినతులే ఉన్నాయి. తమ భూములను ఆక్రమించుకున్నారంటూ పేదలు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి వినతులు ఇచ్చారు. అలాగే తమ భూములను 22ఏ కింద చేర్చి అసైన్డ్ భూములు అంటున్నారని, తమకు న్యాయం చేయాలని మరికొంత మంది కోరారు. 

గ్రామ సహాయకుల సంఘం ప్రతినిధులు మంత్రి అనగానిని కలిసి గత వైసీపీ ప్రభుత్వం తమకొస్తున్న డీఏను తొలగించిందని, అంతేకాక చెల్లించిన మొత్తాలను కూడా రికవరీ చేసిందని, తమకు న్యాయం చేయాలని కోరారు. విద్య, విద్యుత్, ఇతర శాఖలకు సంబంధించి కూడా వినతులు వచ్చాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్ని వినతులను స్వీకరించి శాఖల వారీగా విభజించి సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

నేడు వచ్చిన అర్జీల్లో 90 శాతం వరకు భూములకు సంబంధించిన సమస్యల వినతులే ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులకు పంపించి పరిష్కారం చూపిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అర్జీదారులకు హామీనిచ్చారు.


More Telugu News