పాస్‌పోర్టుపై టీ మరక పడిందని.. బ్రిటన్ జంటను ఎయిర్‌పోర్టు నుంచి గెంటేసిన సిబ్బంది

  • బ్రిటన్‌లో వెలుగు చూసిన ఘటన
  • పాస్‌పోర్టుపై టీ మరక కారణంగా ఇద్దరు ప్రయాణికులను అనుమతించని ‘రయానెయిర్’
  • మరో ఎయిర్‌లైన్స్‌లో గమ్యస్థానానికి చేరుకున్న ప్రయాణికులు
  • ఒక్కో సంస్థ ఒక్కో నిబంధన అమలు చేస్తోందని ఆగ్రహం
  • రంగు మారిన పాస్‌పోర్టు చెల్లదన్న రయానెయిర్
పాస్‌పోర్టుపై చిన్న టీ మరక ఉండటంతో తమను విమానం ఎక్కనీయలేదని ఓ జంట ఆరోపించింది. అదే పాస్‌పోర్టుతో గతంలోనూ ప్రయాణించినా ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ ఎదురుకాలేదని వాపోయింది. బ్రిటన్‌కు చెందిన రోరీ ఆలెన్, నీనా విల్కిన్స్‌కు ఇటీవల ఈ ఊహించని అనుభవం ఎదురైంది. 

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, వారిద్దరూ స్పెయిన్‌లోని కోస్టా బావాకు వెళ్లేందుకు ఈస్ట్‌మిడ్‌లాండ్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రయానెయిర్ చెకిన్ కౌంటర్ దగ్గర తమ పాస్‌పోర్టులతో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించారు. అక్కడి సిబ్బంది నీనా పాస్‌పోర్టుపై టీ మరకను గుర్తించినా లోపలికి అనుమతించారు. ఆ తరువాత వారు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు ముగించుకుని బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న సిబ్బంది మాత్రం నీనా పాస్‌పోర్టుపై టీ మరక ఉండటంతో అభ్యంతరం చెప్పారు. పాస్‌పోర్టు రంగు మారిన కారణంగా ఇది చెల్లదని చెబుతూ విమానం ఎక్కనివ్వలేదు. ఆ తరువాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వారిని విమానాశ్రయం బయటకు తీసుకెళ్లిపోయారు. దీంతో, వారు జెట్2 ఎయిర్‌లైన్స్ టిక్కెట్ బుక్ చేసుకుని బయలుదేరారు. 

ఆ తరువాత బ్రిటన్ జంట తమకు ఎదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. ఒక ఎయిర్‌లైన్స్ సంస్థకు లేని నిబంధనలు మరో సంస్థ ఎలా అమలు చేస్తోందని ప్రశ్నించారు. టీ మరక ఉన్నా కూడా పాస్‌పోర్టులోని కీలక వివరాలన్నీ సరిగానే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇష్టారీతిన నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే పాస్‌పోర్టుతో నీనా అంతకుముందు కూడా ప్రయాణించిందని రోరీ పేర్కొన్నాడు. చిన్న టీ మరక పేరిట తమను నేరస్తుల్లా ఎయిర్‌పోర్టు బయటకు తీసుకొచ్చారని వాపోయాడు. 

ఘటనపై రయానెయిర్ కూడా స్పందించింది. తాము నిబంధనల మేరకే నడుచుకున్నామని స్పష్టం చేసింది. రంగు మారిన పాస్‌పోర్టులు చెల్లవని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నట్టు వెల్లడించింది. అయితే, చెకిన్ కౌంటర్ సిబ్బంది ఆ జంటను లోపలికి అనుమతించడం మాత్రం తమ పొరపాటేనని అంగీకరించింది.


More Telugu News