కొవిడ్ నుంచి కోలుకున్న బైడెన్

  • కొవిడ్ పరీక్షల్లో అమెరికా అధ్యక్షుడికి నెగెటివ్
  • ఆయనలో రోగ లక్షణాలు లేవన్న అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు 
  • మంగళవారం శ్వేతసౌధానికి వచ్చిన అధ్యక్షుడు
  • అంతా సవ్యంగా ఉందంటూ విలేకరుల ప్రశ్నలకు సమాధానం
  • అధ్యక్ష రేసు నుంచి ఎందుకు తప్పుకున్నారన్న ప్రశ్నకు మౌనాన్ని ఆశ్రయించిన వైనం
కరోనా కారణంగా సెల్ఫ్ ఐసోలేషన్‌‌లో మీడియా కంటికి దూరంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొవిడ్ టెస్టులో నెగెటివ్ రావడంతో ఆయన మంగళవారం శ్వేతసౌధానికి చేరుకున్నారు. బైడెన్ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యుడు డా. కెవిన్ తెలిపారు. బైనాక్స్ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చినట్టు వెల్లడించారు. ప్రస్తుతం బైడెన్‌లో రోగ లక్షణాలు ఏవీ లేవని, ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని తెలిపారు. 

మరోవైపు, శ్వేతసౌధం చేరుకున్న బైడెన్‌పై విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. ఎలా ఉన్నారని అడగ్గా అంతా బాగానే ఉన్నట్టు ఆయన బదులిచ్చారు. అయితే, అధ్యక్ష రేసు నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలరా? అన్న ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. 

బైడెన్‌ కొవిడ్ బారినపడ్డట్టు గత బుధవారం తెలిసింది. దీంతో, ఆయన డెలావేర్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. ఈ ప్రకటన తరువాత ఆయన మీడియాకు దూరంగా ఉండటంతో పలు వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. బైడెన్ మళ్లీ శ్వేతసౌధంలోకి కాలుపెట్టడంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్టయింది.


More Telugu News