అలాంటి ప్రాంతాలకు ఎందుకు వెళ్లడం లేదు?: జగన్‌పై షర్మిల ప్రశ్నల వర్షం

  • జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం ఎందుకని ప్రశ్న
  • హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ధర్నా చేయలేదని నిలదీత
  • పూర్తిగా పతనమైపోయారు... ఎవరూ బాగు చేయలేరని ఘాటు వ్యాఖ్య
తన సోదరుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కేవలం ఉనికి కోసం, అలాగే అసెంబ్లీని తప్పించుకోవడం కోసం ఢిల్లీలో ధర్నా అంటున్నారని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం, పోలవరం కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీకి వెళ్లి ఎందుకు ధర్నాలు చేయలేదో చెప్పాలన్నారు. 

వైసీపీ ప్రతి అంశాన్ని జాతీయ సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. భారీ వర్షాలు, వరదలతో ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి ప్రాంతాలకు జగన్ ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు.

అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని చర్చ పెట్టారని, జగన్ అసెంబ్లీకి వెళ్లి తన అభిప్రాయాన్ని చెప్పాలి కదా అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేస్తుంటే జగన్ వెళ్లి వాటిపై మాట్లాడరా? అని ప్రశ్నించారు. జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని... ఇక ఎవరూ బాగు చేయలేరన్నారు. పూర్తిగా పతనమైపోయారన్నారు.

వినుకొండ హత్య కేసుపై న్యూట్రల్ మీడియాను కూడా అడిగామని... తామూ విచారించామన్నారు. ఈ కేసులో హత్యకు గురైన రషీద్‌తో పాటు హంతకుడు కూడా వైసీపీ వ్యక్తే అన్నారు. వీరిద్దరూ వైసీపీలో ఉండగానే విభేదాలు వచ్చాయన్నారు. ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారని... జైలుకు కూడా వెళ్లారని తెలిసిందన్నారు. పరస్పరం ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేసుకున్నారని, స్థానిక వైసీపీ ఇంఛార్జ్ ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారన్నారు.


More Telugu News